పులివెందుల వద్ద లోయలో పడిన ఆర్టీసీ బస్సు .. 25 మందికి గాయాలు

కదిరి నుంచి పులివెందులకు వెళుతుండగా ఘటన పులివెందుల ఆసుపత్రికి గాయపడిన ప్రయాణికుల తరలింపు క్షతగాత్రులను పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కదిరి నుంచి పులివెందులకు వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. వైఎస్ఆర్ జిల్లా పలివెందుల సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కదిరి నుంచి పులివెందులకు వెళుతున్న బస్సు .. డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్ బ్రేకులు వేశాడు. దీంతో బస్సు స్కిడ్ అయి చెట్లను తాకుతూ పక్కనే ఉన్న లోయలో పడింది. కాగా, క్షతగాత్రులను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వారు సూచించారు