కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం
October 20, 2024
ఆదివారం ఉదయం బెంగళూరులో మృతి
సంతాపం తెలియజేస్తున్న అభిమానులు, సినీ పరిశ్రమ
సుదీప్ కుటుండానికి సానుభూతి తెలియజేసిన పవన్‌కల్యాణ్
తెలుగులో ఈగ చిత్రంతో సుపరిచితుడైన కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ విషయాన్ని సుదీప్ కుటుంబ సభ్యులు నిర్ధారిస్తూ... సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆసుపత్రిలో ఉదయం 7గంటలకు కన్నుమూసినట్లుగా తెలిపారు. సుదీప్ తల్లి మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
సుదీప్ తల్లి మరణవార్త తెలుసుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్‌కల్యాణ్ తన సంతాపాన్నితెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ''ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మాతృమూర్తి కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని సుదీప్ ఎన్నోసార్లు తెలిపారు. మాతృవియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని పవన్‌కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.