ఈ సాయంత్రం కేరళకు వెళుతున్న రేవంత్ రెడ్డి
October 22, 2024
వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ
రేపు నామినేషన్ వేయనున్న ప్రియాంక
నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కేరళకు వెళుతున్నారు. వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంకాగాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ తో పాటు, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా గెలుపొందారు. రెండు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో, రాయ్ బరేలీ స్థానం నుంచి ఎంపీగా కొనసాగాలని ఆయన నిర్ణయించారు. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.
ఇప్పుడు ఆ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా నవ్య హరిదాస్ ను బీజేపీ బరిలోకి దించింది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానం కావడంతో ఏకంగా ప్రియాంకాగాంధీని పోటీలో నిలిపింది. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ తో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు