శానిటరీ డివిజన్ ఇన్స్పెక్టర్, ట్రాక్టర్, డ్రైవర్లకు మ్యాపింగ్ చేసి చెత్త తరలింపు.

 

  గుంటూరు 24 అక్టోబర్2024(అక్షరకృష్ణ):

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి శానిటరీ డివిజన్ ఇన్స్పెక్టర్, ట్రాక్టర్, డ్రైవర్లకు మ్యాపింగ్ చేసి చెత్త తరలింపు వాహనాలు కేటాయించాలని ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు స్థానిక కెవిపి కాలనీలోని నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి, డ్రైవర్లు, పర్యవేక్షణ అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వాహనాల నిర్వహణ, పారిశుధ్య విభాగానికి వాహనాలు కేటాయించడంపై తగు ఆదేశాలు జారీ చేశారు.ఈసందర్భంగా కమిషనర్ గారు తొలుత వెహికిల్ షెడ్ లో నిర్దేశిత సమయానికి పూర్తి స్థాయిలో డ్రైవర్లు, పర్యవేక్షణ చేసే ఏఈ విధులకు హాజరు కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎన్ని పర్యాయాలు చెప్పినా పనితీరులో మార్పు కనబడడం లేదని, ఇక నుండి ఉదయం 5 గంటలకు హాజరుకాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెహికిల్ షెడ్ లో డ్రైవర్ల హాజరుకి రిజిస్టర్ మెయిన్టైన్ చేయాలన్నారు. వాహనాల మరమత్తులు యుద్దప్రాతిపదికన జరగాలని, మరమత్తులను ఏ విధమైన కాంట్రాక్టర్ లేకుండా నేరుగా మెకానిక్ షాప్ తో డిపార్ట్మెంట్ తరుపునే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-ఆటోల నిర్వహణకు సదరు కాంట్రాక్ట్ ఏజన్సీ 2 రోజుల్లో తగిన ఏర్పాట్లు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు.అనంతరం అదనపు కమిషనర్, సిఎంఓహెచ్, ఎంహెచ్ఓ, ఇతర ప్రజారోగ్య అధికారులతో సమావేశమై నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు జరగాలని, అందుకు తగిన విధంగా వాహనాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. శానిటరీ డివిజన్ వారీగా ట్రాక్టర్, డ్రైవర్లను గురువారం సాయంత్రానికి మ్యాపింగ్ చేయాలన్నారు. తద్వారా డివిజన్ పరిధిలో చెత్త తరలింపు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. సచివాలయాల వారీగా మరమత్తుకు గురైన పుష్ కాట్స్ ని వెహికిల్ షెడ్ కి తీసుకురావాలని, వాటిని 2 రోజుల్లో మరమత్తు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యటనలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓలు డాక్టర్ రవిబాబు, రాంబాబు, రామారావు, ఆనందకుమార్, డిఈఈ సతీష్, ఏఈ రవి కిరణ్ పాల్గొన్నారు.