సనాతన ధర్మ వివాదంపై మళ్లీ స్పందించిన ఉదయనిధి స్టాలిన్
October 22, 2024
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన ఉదయనిధి
ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టీకరణ
పెరియార్, అన్నాదురై, కరుణానిధి అభిప్రాయాలనే వెల్లడించానని స్పష్టీకరణ
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఉదయనిధి
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోమారు ఆ వ్యాఖ్యలపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో చేసిన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. సోమవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ద్రవిడ నేతలు పెరియార్, మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి అభిప్రాయాలనే తాను వెల్లడించినట్టు చెప్పారు.
‘మహిళలను చదువుకునేందుకు అనుమతించడం లేదు. వారు ఇల్లు విడిచి బయటకు రాకూడదు. భర్తలు మరణిస్తే వారు కూడా చచ్చిపోవాలి. పెరియార్ దీనిని తీవ్రంగా ఖండించారు. నేనిప్పుడు పెరియార్, అన్నాదురై, కళైజ్ఞర్ (కరుణానిధి) మాటలనే చెప్పాను’ అని ఉదయనిధి వివరించారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ‘డెంగ్యూ’, ‘మలేరియా’తో పోల్చారు. దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘సనాతన నిర్మూలన సదస్సు’లో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీశాయి. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని ఉదయనిధి పేర్కొన్నారు.
‘‘నా వ్యాఖ్యలను వక్రీకరించారు. ఒక్క తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా నాపై కేసులు నమోదయ్యాయి. క్షమాపణలు చెప్పాలని వారు నన్ను డిమాండ్ చేస్తున్నారు. అయితే, చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యాఖ్యలపై నేను కట్టుబడి ఉన్నాను. నేను కళైజ్ఞర్ మనవడిని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’’ అని ఉదయనిధి తేల్చి చెప్పారు. తనపై నమోదైన కేసులను ఎదుర్కుంటానని స్పష్టం చేశారు.