ఈవీఎం గోడౌన్‌ ను తనిఖీ చేసిన జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా.నిధి మీనా

 విజయవాడ 29 అక్టోబర్ (అక్షరకృష్ణ):గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును  మంగళవారం జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీయంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్‌ గోడౌన్‌ కు వేసిన సీల్డ్‌ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్‌ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపవలసి ఉంటుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు.తనిఖీలో డిఆర్ఓ  వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ డిటి మధుబాబు, అధికారులు,సిబ్బంది ఉన్నారు.