ఉమ్మడి అనంతలో వరద విళయం
October 22, 2024
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసాయి. అనంతపురం జిల్లాలోని అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి. శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా చిత్రావతిలో నీరు పారుతోంది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఎన్నడూ కూడా ఇలా ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రాలేదని పలు కాలనీలవాసులు తెలిపారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందుతుంది. తిండి గింజలు కట్టుకున్న బట్టలు సైతం నీటిపాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో నీట మునిగిన పలు కాలనీల నుంచి ప్రజలను పోలీసు యంత్రాంగం రక్షించింది.