గత 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడున్న చంద్రబాబు :జగన్

 

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడున్న చంద్రబాబు ఈనాటికీ అదే చేస్తున్నాడని విమర్శించారు. ఎదుటివారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తన కుంభకోణాలు బయటపడుతున్నాయని, తన అవినీతి బయటికివస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరాల కింద అరెస్ట్ చేయాల్సి వస్తే చంద్రబాబునే అరెస్ట్ చేయాలని అన్నారు.సోషల్ మీడియా వేదికగా గొంతు విప్పుతున్న వారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను ఎత్తిచూపుతున్న యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వివరించారు."దాదాపు అన్ని పేపర్లు చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. కాస్తో కూస్తో ప్రజా సమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బతీశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ఆ టీవీల ప్రసారాలను ప్రజలకు చేరనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక చంద్రబాబుకు కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి... అదే... సోషల్ మీడియా. అందుకే చంద్రబాబు ఇంతగా బరితెగిస్తున్నారు.ప్రజలకు మంచి చేసి కాకుండా, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చాక దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. ఇందుకోసం చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు... దాన్ని తన ఎల్లో మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చేస్తారు. దానిమీదనే పార్టీ నేతలతో మాట్లాడిస్తారు. దత్తపుత్రుడిని, ఇతర పార్టీలో ఉన్న తన అనుకూల వ్యక్తులను కూడా దీనికోసం వాడుకుంటారు. దీనికి మరిన్ని అసత్యాలు జోడించి, తన కొడుకు లోకేశ్ ద్వారా సోషల్ మీడియాలో విష ప్రచారం చేయింస్తారు.వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే విచారణ చేస్తారు, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైరు పేలిపోతే, ఆ ఘటన ఇప్పుడే జరిగినట్టుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది నువ్వు కాదా? దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్ని కూడా ఫేక్ లెటర్ అంటూ ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య కాదా? దాంతో మా అమ్మ వీడియో సందేశం ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది" అంటూ జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.