తెలంగాణలో త్వరలో ముఖ్యమంత్రి మారనున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పందించారు. మహేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు... మరో పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని జోస్యం చెప్పారు.తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ఠ అన్నారు. బీజేపీలో చేయడానికి మహేశ్వర్ రెడ్డికి ఏ పనీ లేదని, అందుకే పగటి కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీలో రోజురోజుకూ విభేదాలు ముదిరిపోతున్నాయన్నారు. వారి విభేదాల నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు సీఎం మారతారంటూ జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.