పాత్రికేయులు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలి
- విభజన సమయంలో కత్తి మీద సాములా పనిచేశా
- విజయవాడతో నా అనుబంధం ఈనాటిది కాదు
- గెట్ టు గెదర్లో ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్
- శ్రీనివాస్ స్ఫూర్తి నేటి జర్నలిస్టులకు ఆదర్శం
- ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు
విజయవాడ: పాత్రికేయ రంగంలో యాజమాన్యం విధానాలు ఎంత ముఖ్యమో, పాత్రికేయులకు సమాజం పట్ల బాధ్యత అంత ముఖ్యమని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు, సాహితీవేత్త కె. శ్రీనివాస్ ఉద్ఘాటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన శ్రీనివాస్ గెట్ టు గెదర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన పాత్రికేయ ప్రస్థానం విజయవాడలో సబ్ ఎడిటర్ గా మొదలైందని, ఈ ప్రాంతంతో తనకెంతో అనుబంధం, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. వృత్తి పరంగానే కాక, సాహిత్యపరంగా, పుస్తక ప్రదర్శన కోసం విజయవాడకు వస్తూ ఎంతోమంది మిత్రులను సంపాదించుకున్నానని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వాసిగా ఆ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తానని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఒకే సంపాదకుడిగా కొనసాగడంపైనా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. అయితే పాత్రికేయులు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమాజం కోసం, సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని, అందుకే తన రాతల పట్ల అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం తర్వాత అభిమానించారని పేర్కొన్నారు. విభజన సమయంలో ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా పని చేయడం కత్తి మీద సాముగా మారిందని గుర్తు చేసుకున్నారు. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా అభివృద్ధి జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఎడిటర్ గా ప్రజల జీవితాలను దగ్గరి నుంచి పరిశీలించే అవకాశం తనకు లభించిందని, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనల్లో కలిసిన గ్రామీణ ప్రాంత విలేకరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వారే తన గురువులని పేర్కొన్నారు. పాత్రికేయులు ఏ స్థాయిలో ఉన్నా నిత్యం నేర్చుకుంటూ ఉండాలని సూచించారు. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితలు విశాఖపట్నంలో ఏయే ప్రాంతాల్లో కూర్చుని రాశారనే కథనం ప్రచురించడం తన పాత్రికేయ జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు. ప్రస్తుత సమాజంలో పరిశోధనాత్మక జర్నలిజం లేకుండా పోయిందని, ప్రభుత్వాల్లో అవినీతి జరుగుతోందని ప్రజలకూ తెలుసని అభిప్రాయపడ్డారు. పదవీ విరమణ చేసినా పాత్రికేయ రంగంతో అనుసంధానాన్ని కొనసాగిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీనివాస్ సతీమణి సుధ మాట్లాడుతూ వ్యక్తిగతంగా సున్నిత మనస్కులైన ఆయన ఒక గొప్ప తండ్రిగా పిల్లలను పెంచారన్నారు. శ్రీనివాస్ అరెస్టైనప్పుడు పాత్రికేయులంతా తమతో ఉన్నారు కాబట్టే ఇంత సాధించగలిగారని వివరించారు. శ్రీనివాస్ ఒక్కరు కాదని, అందరూ కలిసిన సంఘర్షణ శక్తి అని చెప్పారు. తమ జీవన ప్రయాణం కూడా విజయవాడలోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. సభాధ్యక్షులు ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ శ్రీనివాస్ సంపాదకులుగా, జర్నలిస్టుగా, సాహితీవేత్తగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులని కొనియాడారు. ఆయన వ్యాసాలు, రచనలు, కథనాలు అందరికీ పరిచయమేనని, ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్ మీడియా, జర్నలిస్టుల మీద ఎక్కడ దాడులు జరిగినా వ్యతిరేకించి పోరాడటంలో ముందుండేవారని వివరించారు. తెలంగాణ అక్రిడిటేషన్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఇచ్చిన ప్రతిపాదనలను ఆంధ్రాలోనూ అమలు చేయాలని సమాచార శాఖ మంత్రి, డైరెక్టర్లను కోరామని తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో శ్రీనివాస్ కమిటీ ఇచ్చిన డ్రాఫ్ట్ లోని అంశాలను అనుసరించి ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తుమన్నారు. జర్నలిస్టుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న శ్రీనివాస్ స్ఫూర్తితో మనమంతా పని చేయాలని ఐవీ సుబ్బారావు అన్నారు. ఐజేయు కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు మాట్లాడుతూ శ్రీనివాస్ జ్ఞానం అపారం, వ్యక్తిత్వం నిరాడంబరం, మాట సున్నితం, రాత ఖండితమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, దళిత పక్షపాతి శ్రీనివాస్ అన్నారు. యూనియన్ ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారన్నారు. విజయవాడ అర్బన్ అధ్యక్షుడు చావా రవి మాట్లాడుతూ సంపాదకుల్లో సి. రాఘవాచారి తర్వాత అంతటి ఆదర్శంగా తీసుకునే వ్యక్తి శ్రీనివాస్ అని కొనియాడారు. నేటి తరం పాత్రికేయులు శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్ మాట్లాడుతూ శ్రీనివాస్ సంపాదకీయాలు సమకాలీన అంశాలను విశ్లేషిస్తాయని, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, ఆలోచింపచేసేలా ఉంటాయని ప్రశంసించారు. చిన్న పత్రికల సంఘం సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ వ్యాసాలు సమాజాన్ని అన్ని కోణాల్లో పరిచయం చేస్తాయని కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు చిగురుపాటి సతీష్, వడ్లమూడి పద్మావతి, వీ.కృచ్చేవ్ మాట్లాడుతూ శ్రీనివాస్ రాసే అక్షరాలతో మనమూ ప్రయాణిస్తామన్నారు. ఆయన రాతలు సంక్షిప్తంగా, సున్నితంగా, సూటిగా ఉంటాయని కొనియాడారు. సభకు యూనియన్ విజయవాడ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ దంపతులకు శాలువాలు, పుష్ప గుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, విశాలాంధ్ర న్యూస్ ఎడిటర్ మోదుమూడి మురళీ కృష్ణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, కోశాధికారి సయ్యద్ అహ్మద్ హుస్సేన్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ మీరా, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు సాంబశివరావు, సుబ్బారావు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.