గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, నేడు (నవంబర్ 9) లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడారు. "అందరికీ నమస్కారం. మా కోసం ఇక్కడి వరకు వచ్చిన మీడియా, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. శంకర్ గారిని ఈ రోజు మిస్ అవుతున్నాం. ఆయన ఫైనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం అదృష్టం. ఇండియాలో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషుల మనసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఈ రోజు ఇక్కడ టీజర్ లాంచ్ జరగడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ కియారా అద్వానీ, నటుడు ఎస్ జె సూర్య, అంజలి కూడా హాజరయ్యారు.
దిల్ రాజు మాట్లాడుతూ, తమ ప్రొడక్షన్‌లో ఇది 50వ చిత్రమని తెలిపారు. శంకర్ తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, పైగా అది రామ్ చరణ్‌తో అవ్వడం మరింత ఆనందంగా ఉందని వివరించారు.
కియారా అద్వానీ మాట్లాడుతూ... "లక్నోలో మా చిత్ర ప్రయాణం ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడకు రావాలని చాలా రోజుల నుంచి ఎదురుచూశాను. శంకర్ గారి వల్ల ఈ రోజు మేం ఇక్కడకు వచ్చాం. రామ్ చరణ్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది" అని వెల్లడించారు.
ఎస్ జె సూర్య మాట్లాడుతూ... "గేమ్ చేంజర్ సినిమాలో టీజర్‌ను మాత్రమే చూశారు. ఇక అసలు సినిమా ముందుంది. ఈ రోజు శంకర్ గారు కూడా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ ఎడిటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కలిసి చేసిన ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతోంది. అందరూ చూడండి" అని అన్నారు.
అంజలి మాట్లాడుతూ... "గేమ్ చేంజర్‌లో నా పాత్ర విని వెంటనే ఓకే చెప్పాను. చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ మూవీ ఒప్పుకోవడానికి రామ్ చరణ్, శంకర్ గారు, దిల్ రాజు గారు కూడా కారణం. సంక్రాంతికి ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని పేర్కొన్నారు.