బాపట్ల 05 నవంబర్ 2024(అక్షరకృష్ణ):బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి మంత్రి గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి మంగళవారం జిల్లాకు తొలిసారిగా రావడంతో ఘన స్వాగతం లభించింది. పీవీపాలెం యాజలి వద్ద గుంతల రహిత కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి భూమి పూజ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తేనీరు తాగుతూ వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్యం పనిముట్ల వివరాలపై ఆరా తీశారు. వేతనాల చెల్లింపులు, వారి కుటుంబ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లాలోని 2,200 మంది పారిశుద్ధ్య కార్మికులకు పనిమట్లు, ప్రాథమిక వైద్య కిట్లు ఇవ్వడానికి రూ.46 లక్షలు నిధులు అవసరమని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి పార్థసారథి కలెక్టర్ తో మాట్లాడి తక్షణమే జిల్లా మినరల్ ఫండ్ నుంచి నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు జిల్లా ఇన్చార్జి మంత్రిని ఘనంగా సత్కరించారు.జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. ప్రజా ప్రతినిదులందరితో కలిసి పనిచేస్తామన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన భూముల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అలాగే పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.
గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సుఖమైన ప్రయాణం కొరకు గుంతల రహిత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.826 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. నెల రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేని రోడ్లను అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా దీపం పథకం-2 ని ప్రారంభించామని, ఒకదాని వెంట మరొకటి హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పర్యాటక ప్రాంతమైన బాపట్ల జిల్లాలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మరింతగా లభిస్తాయన్నారు.రహదారులపై సుఖ ప్రయాణం కొరకు ప్రభుత్వం గుంతలు పూడ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో రూ.3.24 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయన్నారు. యాజిలీ ఖాజీపాలెం రహదారిని రూ.39 లక్షల నిధులతో మరమ్మతులు చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య, ఆర్ అండ్ బి ఈఇ గీతారాణి, డిపిఓ ప్రభాకర్, ఆర్డీవో పి గ్లోరియా, తదితరులు పాల్గొన్నారు.